రోజులు ఎంత గంభీరంగా మారినా కొన్ని దుర్గుణాలు మనం వదులుకోలేకపోతున్నాం. మన అంతరాత్మ ముందుమనల్ని మనం నిలబెట్టుకోవడం ఇప్పుడు కావాలి.
గమనించి చూడండి. రైల్వే గేటు పడి ఉంటుంది. రైలు మరికొద్ది నిమిషాల్లో రాబోతున్నదని మనకు అర్థమవుతూనే ఉంటుంది. కాని ఒకడెవడో, మనలో ఒకడెవతో బైక్‌ను గేటు కింద నుంచి దూర్చి హడావిడిగా అవతలి వైపుకు వెళ్లడానికి ప్రయాస పడుతుంటాడు. వాడికి అర్జెంట్ పని ఏమీ ఉండదు. మహా ఉంటే అది అయిదు నిమిషాలపాటు ఆగేదే అయి ఉంటుంది. కాని వాడు గేటు దాటాల్సిందే. అలా దాటి వెళితే, కొంత మంది దాటలేక అటువైపే ఉండిపోతే వాడికి అదొక తృప్తి.‘బయట పడేయ్... బయట పడేయ్’ అంటుంటారు తల్లిదండ్రులు. కారులో ఉన్న పిల్లలు ఏదో ఒకటి తిని, ఆ రేపర్‌ని చేతిలో పట్టుకుని ఉంటే తల్లిదండ్రులకు ఏమీ తోచదు. దానిని బయట పడేయాలి. కారు ఎక్కడ ఉన్నా.. గుడి ముందు ఉన్నా బడి ముందు ఉన్నా నడి రోడ్డులో ఉన్నా డోర్ దించి ఆ చెత్తను బయట పడేయాలి. కారు శుభ్రంగా ఉంచాలి. చెత్త జనానికి పంచాలి. ఎవరూ ఏమీ అడగరని అలాంటి తల్లిదండ్రులకు అదొక ధైర్యం.
‘చూచూ వస్తోంది’ అంటే ‘ఎక్కడో ఒక చోట పోసెయ్‌రా’ అనే పెద్దలు తప్ప, ఇల్లు వచ్చే వరకూ ఆగు, బయలు దేరే ముందు పోసుకో అని చెప్తున్నారా ఎక్కడైనా? నలభై ఏళ్లు వచ్చినా, యాభై ఏళ్లు వచ్చి జుట్టు తెల్లబడినా ఖాళీ చోటు కనిపిస్తే చాలు దానిని పాడు చేసే హక్కు ఉన్నట్టుగా బయల్దేరే, చెట్టు కనిపిస్తే దానిని టాయిలెట్ కమోడ్‌గా భావించే పుణ్యపురుషులు భయంకరమైన శిక్ష పడుతుందని చెప్తేనో ప్రాణాంతకమైన క్రిమి సోకుతుందని నిర్థారిస్తేనో మాత్రమే మారుతారా? మామూలు సమయాలలో మామూలు మర్యాదలను పాటించలేరా?