సేవా 'వరం'టీర్లు

ఏలూరు/తణుకు/నిడదవోలు రూరల్‌/నరసాపురం రూరల్‌/మొగల్తూరు: గ్రామ, వార్డు వలంటీర్లు కరోనా మహమ్మారిని నియంత్రించడంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంటింటా సర్వే చేయడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలను వివరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సహకారంతో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో జిల్లాలో వలంటీర్ల పాత్ర కీలకంగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాబారిన జిల్లా ప్రజలు పడకుండా వీరు పోషిస్తున్న పాత్ర అందరి ప్రశంసలు అందుకుంటోంది. వీరికి తోడుగా ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు జిల్లాలో పరిస్థితి అదుపు తప్పకుండా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం, వారి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇవ్వడంలో ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పనికొంత సులభమైంది. విదేశాల నుంచి వచ్చిన వారు రాష్ట్రంలోనే ఎక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నారు. కరోనా విజృంభణ మొదలైన తర్వాత వివిధ కరోనా పీడితదేశాల నుంచి మూడు వేల మందికి పైగా జిల్లాకు తిరిగి వచ్చారు.